RSS
email

ప్రభాస్ "బిల్లా" రివ్యూ


ప్రభాస్, కృష్ణంరాజు, జయసుధ, నమిత, అనుష్క, హన్సిక, అలీ, సుప్రీత్, అరవింద్, సుబ్బరాజు, రెహ్మాన్ తదితరులు నటించిన ఈ సినిమాకు మోహర్ రమేష్ దర్శకుడు. సంగీతం మణిశర్మ. నిర్మాతలు నరేంద్ర, ప్రబోద్. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ లావిష్ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు కూడా దర్శకుడు మెహర్ రమేష్ సమకూర్చారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే చందంగా, క్రిమినల్‌ను పట్టుకోవడానికి మరో క్రిమినల్‌ను పోలీసులు ఆశ్రయించి పనిని పూర్తి చేయడమే ఈ సినిమాలో ప్రధానాంశం.

ఇదొక దొంగ-పోలీసు కథ. ఈ తరహా చిత్రాలు చాలానే వచ్చాయి. పాత కథను కొత్తదనంగా తెలియజెప్పేందుకు ప్రయత్నం చేశాడు మెహర్ రమేష్. గతంలో ఎన్టీఆర్ నటించిన భలే తమ్ముడు, యుగంధర్, అమితాబ్, షారుఖ్, రజనీకాంత్‌లు చేసిన డాన్, తమిళంలో ఇటీవలే విడుదలైన అజిత్ "బిల్లా"... ఇలా ఒక సినిమాను ఇంతమంది చేసినా, దాన్ని ఇన్నిసార్లు తీయడం కూడా సాహసమనే చెప్పాలి. అందులోనూ గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ 16 ఏళ్ల తర్వాత సినిమా తీస్తూ ఇటువంటి కథను ఎంచుకోవడం విశేషమే.

కథ: మలేషియా స్థావరం ఏర్పరుచుకున్న అంతర్జాతీయ నేరస్థుడు బిల్లా( ప్రభాస్). దేనినీ లెక్కచేయని ధైర్యవంతుడు. అతడిని పట్టుకోవడానికి ఇంటర్ పోల్ కూడా ప్రయత్నిస్తుంది. హైదరాబాద్ కు చెందిన కృష్ణమూర్తి ( కృష్ణంరాజు) ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా బిల్లాకోసం మలేషియా వస్తాడు.

కానీ బిల్లా ఎన్‌కౌంటర్‌లో చనిపోతాడు. దాన్ని రహస్యంగా ఉంచి అదే రూపమున్న వైజాగ్‌కు చెందిన పిక్‌పాకెటర్ రంగా (ప్రభాస్)ను బిల్లాస్థానంలో కృష్ణమూర్తి ప్రవేశపెడతాడు. ఇందుకు ఇన్‌ఫార్మర్ శంకర్ (అలీ) సహకరిస్తాడు. బిల్లా స్థానంలో రంగాను ప్రవేశపెట్టేందుకు వీలుగా, కృష్ణమూర్తి అతనికి (రంగా) తగిన ట్రైనింగ్ కూడా ఇస్తాడు.

ఆ తర్వాత కృష్ణమూర్తి రంగా ద్వారా క్రిమినల్ కార్యకలాపాలను ఎలా అరికట్టాడు? రంగా డాన్ గ్యాంగ్‌నుంచి, అటు పోలీసుల నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది మిగిలిన కథ. మరి అనుష్క, నమిత పాత్రలు ఏమిటి? అనేది సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ: సాధారణంగా సీరియస్ కథల్లో పాత్రల నటనాతీరుకు అంతగా ప్రాధాన్యత ఉండదు. ప్రభాస్‌కు బిల్లా కథ చాలా బాగా సూటయింది. సిక్స్‌ప్యాక్ బాడీతో పెద్ద కేశాలంకరణతో ప్రభాస్ కొత్తగా కన్పించాడు. ఇందులో కామెడీ ఉందంటే.. రంగా పాత్ర ద్వారా ప్రభాస్ చేసిన కామెడీ మాత్రమే.

రంగా స్నేహితుడిగా ఉన్న శంకర్ (అలీ) పాత్ర కూడా అంతగా కామెడీ పండించలేదు. ఈ చిత్రానికి మైనస్ అంటే కేవలం ఎంటర్‌టైన్‌ మాత్రమే. ఇక అనుష్క, నమిత పాత్రలు ఎక్స్‌పోజింగ్‌కు బాగా ఉపయోగపడ్డాయి. హన్సిక స్పెషల్ పాత్రలు తళుక్కుమంటుంది. నమిత డబ్బింగ్ చెప్పుకోవడం ఈ సినిమాలోని విశేషం. పోలీస్ అధికారిగా కృష్ణంరాజు సూటయ్యాడు. ఆయన పాత్రకూడా స్టైలిష్‌గా ఉంటుంది.

ఇంకా ఈ చిత్రంలో చెప్పుకోదగింది స్క్రీన్‌ప్లే. మొదటి నుంచి చెబుతున్నట్లు సాంకేతికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. జయసుధ పాత్రకు న్యాయం చేసింది. మణిశర్మ సంగీతం వినడానికి వినసొంపుగా లేదు. ఈ చిత్రానికి పాటలు మైనస్ అయితే మణిశర్మ రీరికార్డింగ్ హైలైట్. యాక్షన్ చిత్రం కనుక మాటలు పొదుపుగా ఉన్నాయి.

కాల్పులు, కారు ఛేజింగ్‌లు కావాల్సినన్ని ఉన్నాయి. యూత్‌కు కావాల్సిన మసాలులున్న ఈ చిత్రం కుటుంబాలకు ఎంతమేరకు నచ్చుతుందో చూడాల్సిందే. మొదటి భాగం చకచకా సాగిపోతూ ఆసక్తి కల్గిస్తుంది. రెండో భాగం వచ్చేసరికి కాస్త సాగదీసినట్లుగా కథ నడుస్తుంది. నటనా పరంగా ప్రభాస్‌కు మంచి మార్కులు పడతాయి. మరి మొత్తంగా చూస్తే ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షుకులకు నచ్చుతుందో వేచి చూడాల్సిందే.!




Bookmark and Share

0 comments:

Related Posts with Thumbnails

AddThis

Share |