RSS
email

40 ఏళ్ల యువకుడికి పెళ్లెందుకు కాలేదయా నమో వెంకటేశా..!!




పాయింట్: 21వ శతాబ్దంలో ఎదుటివారిని మోసం చేయడం చేతగానివాడు దేవునిపైనే పూర్తిగా భారం వేసి జీవిస్తే ఎలా ఉంటుందనేది వినోదభరితంగా చూపించాడు దర్శకుడు.

అందుకే సినిమా ఆరంభంలో నేటి మనుషుల్లో ఆప్యాయతలు, అనురాగాలు కనుమరుగయిపోతున్నాయి. పక్కవాడు బాగుంటే వాడిమీద నాలుగు రాళ్లు వేసే మనస్తత్వం నెలకొంది. ఇలాంటి టైమ్‌లో దేవుడిని నమ్ముకున్న ఓ అమాయకుడు ఎలా ఉంటాడో అని నాకు అనిపించింది. అదే కథగా రాసుకున్నానని శ్రీను వైట్ల బ్యాక్‌గ్రౌండ్‌లో చెబుతాడు. చిత్రం చూశాక... చింతకాయల రవి ఫార్మెట్‌లో నుంచి రెడీ కలిపితే ఎలా ఉంటుందో కథ అలా ఉంటుంది. సంగీతపరంగా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు మూడు మినహా మిగిలినవి ఆకట్టుకోలేకపోయాడు.

కథ చెప్పాలంటే...
వెంకటరమణ( వెంకటేష్) ఓ కాలనీలో అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. ఆయన మంచితనం వారిని కట్టడి చేస్తుంది. వెంట్రిలాక్విజమ్ అతని వృత్తి. రాజకీయనాయకుల మీటింగ్‌లో కాస్త ఎంటర్‌టైన్‌గా మాట్లాడే బొమ్మ పెట్టుకుని ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. కానీ అతనికి 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. చిన్నాన్న చంద్రమోహన్ వెంకటరమణకు పెండ్లి సంబంధాలు చూసినా డ్రీమ్‌గాళ్ కోసం వెతుకుతుంటాడు.

ఓసారి ఎంఎస్ నారాయణ అనే జ్యోతిష్యుడు వచ్చి జాతకాన్ని చూసి నీ జాతక ప్రకారం నెలరోజుల్లో పెళ్లి అవుతుంది... లేదంటే ఒంటరిగా జీవితాన్ని గడపాల్సి వస్తుందంటాడు. అయినా మనవాడు ఇంకా పాజిటివ్‌గా ఆలోచించే రకం కనుక ఎప్పటికైనా డ్రీమ్‌గాళ్ వస్తుందని కలలు కంటాడు.

పారిస్ ప్రసాద్ ( బ్రహ్మానందం) కొంతమంది కళాకారులను పారిస్ తీసుకెళుతుంటాడు. ఇందులో వెంకటరమణ కూడా ఒకరు. మిగిలినవారు పృథ్వీ, శ్రీనివాస రెడ్డి, రఘు బాబు వివిధ రకాల కళా పోషకులు. ప్రసాద్ అన్న కుమార్తె పూజ( త్రిష) కూడా టూర్‌కి వస్తుంది. ప్రసాద్‌ది భిన్నమైన మనస్తత్వం. ఎదుటివారిని ఏడిపించే రకం. వారిని ఇబ్బందిపెట్టి ఎంజాయ్ చేసే రకం. ఆ రకంగా వెంకటరమణను పూజ ప్రేమిస్తుందని అబద్ధం చెప్పి ఆటపట్టిస్తుంటాడు. కానీ వెంకటరమణ నిజంగా ప్రేమిస్తోందని ఫిక్స్ అయిపోతాడు. తన దేవుడు వేంకటేశ్వర స్వామి తన డ్రీమ్ గాళ్‌ను పంపాడని మురిసిపోతుంటాడు.

అకస్మాత్తుగా ఓ రోజు పూజ తన ఊరుకు వెళుతుంది. అక్కడ తన మేనమామ ఆస్తికోసం పూజను తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తాడు. ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తాడు. పూజ అకస్మాత్తుగా వెళ్లిపోవడంతో ప్రసాద్‌కు విదేశీ కాంట్రాక్టులో రావాల్సిన సొమ్ము ఆగిపోతుంది. తనను ఎలాగైనా ఊరి నుంచి విడిపించుకుపోతే నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానంటుంది పూజ. ఆ క్రమంలో వెంకటరమణ సాయంతో ప్రసాద్ పూజను ఎలా విడిపించాడు. పూజను పెళ్లి చేసుకున్నాడా...? అన్నది మిగిలిన కథ.

వెంకటేష్ కథనంతా తన భుజపైకే లాక్కున్నాడు. ఆయనకు సపోర్ట్‌గా బ్రహ్మానందం, పృథ్వీ, సూర్య పాత్రలు ఎంటర్‌టైన్ చేస్తాయి. పాత సన్నివేశాలైనా తాగినప్పుడు ముగ్గురినీ కొట్టడమనేది కొత్తరకంగా చూపించి మెప్పించాడు. అలాగే త్రిష కూడా బాగానే ఉంది. ఆమె మామల నుంచి తనను కాపాడుకునే క్రమంలో చేసే సన్నివేశాలన్నీ రెడీని తలపింపచేస్తాయి. సినిమా చూశాక కానీ ఆ విషయం తెలీదు. మొత్తంగా బ్రహ్మానందం పాత్ర హైలెట్. కథాగమనంలో బాగా నవ్విస్తాడు.

ఇక నటనాపరంగా ముఖేష్ రుషి, జయప్రకాష్ రెడ్డి, కోట, పాత్రలు రొటీన్‌గా ఉన్నా బాగానే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పాతబాణీలను తలపించినా ఫర్వాలేదనిపిస్తాయి. రింగా రింగా పాట కామెడీ తెప్పిస్తుంది. తాగిన తర్వాత కుక్క వెంటాడే సీన్ బాగానే ఉంది. సంభాషణలపరంగా బాగానే ఉన్నాయి. ఎక్కడా బోర్ కొట్టదు. కాకపోతే 2, 3 పాటలు వచ్చినప్పుడు థియేటర్లో ప్రేక్షకులు లేచి బయటికెళ్లడం కనిపించింది. కథ బాగా నడుస్తున్నప్పుడు పాటలు అకస్మాత్తుగా పరకాయ ప్రవేశం చేస్తున్నట్లనిపిస్తుంది.

సినిమా ఆరంభంలో వెంకటేష్ చెప్పినట్లు... కథ పాతదే... సన్నివేశాలు తీయడం కొత్తగా ఉంటాయి అన్నాడు. సినిమా చూశాక అదే అనిపిస్తుంది. ఇందులో ఆకాష్ పాత్ర తులసిలో సన్నివేశాన్ని గుర్తుకు తెస్తుంది. అసలు త్రిష ప్రేమించింది ఆకాష్‌ను. ఆయనకోసం వెంకటేష్‌ను అడ్డుపెట్టుకుని పారిపోవాలని చూస్తుంది. చివరకు తనకోసం తన ఫ్యాక్షనిస్టు మేనమామను ఎదిరించడం చూశాక మనసు మార్చుకుని వెంకీ పరమవుతోంది. మొదటి భాగం సరదాగా సాగుతుంది. రెండవ భాగంలో కాస్త యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉన్నా.. కథాగమనంలో కనిపించవు. ఈ చిత్రం కుటుంబం చూడదగ్గ చిత్రం. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
Read more

నటీనటులు: విక్టరీ వెంకటేష్, త్రిష, బ్రహ్మానందం, కాశీ విశ్వనాథ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జయప్రకాష్ రెడ్డి, సూర్య, సుబ్బరాజు, మాస్టర్ భరత్, తెలంగాణా శకుంతల, శ్రీనివాసరెడ్డి తదితరులు.
కెమేరా: ప్రసాద్, 
ఎడిటింగ్: ఎం.ఆర్ వర్క్స్,
సంగీతం: దేవిశ్రీప్రసాద్, 
నిర్మాతలు: ఆచంట రాము, గోపీచంద్, సుంకర అనిల్, 
బ్యానర్: 14 రీల్ ఎంటర్‌టైన్మెంట్, సురేష్ ప్రొడక్షన్, 
కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం: శ్రీను వైట్ల

Bookmark and Share

0 comments:

Related Posts with Thumbnails

AddThis

Share |