RSS
email

జూనియర్ ఎన్టీఆర్స్ అదుర్స్




పాయింట్: ఇద్దరు అన్నదమ్ములు చిన్నతనంలోనే విడిపోతారు. పెద్దయ్యాక తన తండ్రికోసం అన్వేషిస్తుంటారు. ఆ క్రమంలో తండ్రిని రక్షించాల్సి వస్తుంది. అది ఏమిటనేది సినిమా కథ.
సినిమా విడుదలవుతుందన్న దగ్గర్నుంచీ అదుర్స్ చిత్రాన్ని చాలా వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా కథ తనదంటూ కరీంనగర్‌కు చెందిన మోహన్ అనే వ్యక్తి షడెన్‌గా మీడియా ముందుకు వచ్చాడు. ఎన్ని అడ్డంకులున్నా.. ఈ చిత్రాన్ని తెలంగాణాలోనూ రిలీజ్ చేశారు. ఉద్యమకారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రేక్షకులు మాత్రం ఓపెనింగ్స్‌తో "అదుర్స్" అన్నారు.

కథ విషయానికొస్తే.. రాముడు- భీముడు తరహాలో ఎన్టీఆర్ అన్నదమ్ముల పాత్రల్లో నటించాడు. చిన్నతనంలో ఓ సంఘటనతో విడిపోతారు. ఒకరు సనాతన బ్రాహ్మణ కుటుంబంలోకి ప్రవేశిస్తాడు. అది ఎలాగంటే... ఆస్పత్రిలో ఓ స్త్రీకి పురిటిలోనే కొడుకు చనిపోతాడు. ఆ పక్కనే ఉన్న బెడ్‌పై మరో స్త్రీకి కవలలు పుడతారు. ఈ విషయం తెలిసిన డాక్టర్ ఒక బిడ్డను ఎత్తుకొచ్చి ఈవిడ ప్రక్కన పడుకోబెడుతుంది. మమూలుగానే కవలలు కన్నా ఒకడు పోయాడని ఆ స్త్రీకి చెబుతారు. కొద్దిసేపు ఫీలయి ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తుంది. అలా ఇద్దరు విడిపోతారు.

ఇదిలావుండగా, బ్రాహ్మణ కుటుంబంలో పెరుగుతున్న అబ్బాయికి చారి అని పేరు పెడతారు. అన్నీ శాస్త్రోక్తంగా జరగాలనే సాంప్రదాయాన్ని అవపోసన పడతాడు. మరి అసలు తల్లి దగ్గర పెరుగుతున్న మరోవాడు చాలా రష్‌గా మారతాడు. ఇతని పేరు నరసింహ. అతని తండ్రి మిలట్రీ అధికారి. ఆ పాత్రను నాజర్ పోషించాడు. చివరకు ఓ సందర్భంలో అన్నదమ్ములు కలుస్తారు. తన తండ్రి విషయం తెలిసి ఆయనకోసం వెళతారు. ఆయన అప్పటికే ఆపదలో ఉంటాడు. అది ఏమిటి...? అనేది మిగిలిన సినిమా.

ఇక ఎన్టీఆర్ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. చాలా చక్కగా రెండు పాత్రలను పోషించాడు. డాన్స్‌లో తన సత్తాను మరోసారి చాటాడు. ఆ మధ్య కాస్త సన్నబడి నీరసంగా పైకి అనిపించినా... ఈసారి ఆ ఛాయలు కనబడవు. మాస్ పాత్రను బాగా అలరించాడు. దానితోపాటు చారి పాత్రను పక్కా బ్రాహ్మణునిగా చేశాడు. దానికోసం కాస్త ట్రైనింగ్ అయ్యాడు కూడా. ఇక నయనతార ఈ చిత్రం షూటింగ్‌లోనే అమ్మమ్మ చనిపోవడం ఆమె ఆరోగ్యం బాగోకపోవడంతో... మొహంలో కాస్త గ్లామర్ తగ్గినట్లు అనిపించింది. రెండో పాత్రధారి షీలా పాత్రమేరకు బాగానే చేసింది.

ఇదంతా ఒక ఎత్తయితే... భట్టు పాత్రలో బ్రహ్మానందం అలరించాడు. కానీ చివరివరకూ ఆ పాత్ర ఉండదు. ఇక రవిబాబు, ఎంఎస్ నారాయణ, రఘుబాబు పాత్రలు కామెడీకి తోడయ్యాయి. భరిణి తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయాడు. కొండవలసకు అమితాబ్ గెటప్ పెట్టి నవ్వించారు. సంభాషణల పరంగా ఆ మధ్య మొద్దు శీను డైలాగులు గుర్తుకు వస్తాయి. కొన్ని డైలాగులు అలాగే ఉన్నాయి. తండ్రి పాత్రలో నాజర్ బాగా చేసినా ఆయన ఒక ఆయుధాన్ని తయారు చేసే నిమిత్తంలో ఉంటాడు. అది ఎందుకు..? ఏమిటి..? అనేదానికి క్లారిటీ లేదు.

యాక్షన్ కామెడీ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులను నిరుత్సాహ పరచదు. ఏది ఏమైనా ఇంత గొడవల్లో కూడా విడుదలై బ్రహ్మాండం కాకపోయినా బాగానే ఉందని ప్రేక్షకులచేత అనిపించుకుంది.
నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, నయనతార, షీలా, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, భరణి, రఘుబాబు, తదితరులు.
కెమేరా: ప్రసాద్,
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, 
ఎడిటింగ్: గౌతం రాజు, 
నిర్మాత: వంశీ మోహన్, 
సమర్పణ: కొడాలి నాని, 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్

Bookmark and Share

0 comments:

Related Posts with Thumbnails

AddThis

Share |